నేడు కరీంనగర్ కు రానున్న జేపీ నడ్డా

JP Nadda to address public meeting in Karimnagar

హైదరాబాద్‌ః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు(గురువారం) కరీంనగర్ కు రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తయింది. కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సభకు జేపీ నడ్డాతోపాటు బిజెపి ఇంచార్జ్ లు తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ లాంటి ముఖ్యనేతలు హాజరు కానున్నారు‌. ఉత్తర తెలంగాణ జిల్లాలైన‌ ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో కరీంనగర్ సభ నుంచే ఏన్నికల‌ ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది.

కాగా, మొదటి నాలుగు విడతల్లో బండి సంజయ్ పాదయాత్రతో 13 పార్లమెంట్, 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 21జిల్లాల మీదుగా సాగింది. మెదటి నాలుగు విడత పాదయాత్ర ద్వారా 1178కిలోమీటర్లు నడిచారు‌. గతేడాది ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర నుంచి ఇప్పటివరకు మొత్తం 14 భారీ బహిరంగ సభలు, వందకుపైగా మినీ సభలతో సాగింది. కరీంనగర్ సభ ముగిసిన వెంటనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై బండి సంజయ్ ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/