జేపీ నడ్డా కు ఘనస్వాగతం పలికిన నేతలు

బిజెపి జాతీయ కార్యనిర్వహణ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు తెలంగాణ బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చాలామంది చేరుకున్నారు. అయితే ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక రోజు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

అయితే ఢిల్లీ నుంచి జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన వెంట జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ నేత లక్ష్మణ్‌లతో పాటు విజయశాంతి, ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి స్వామి గౌడ్ వివేక్ వెంకటస్వామి ధర్మపురి అరవింద్ ,పొంగులేటి సుధాకర్ రెడ్డి లు ఉన్నారు. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి శంషాబాద్ టౌన్ లో కిలోమీటర్ మేర రోడ్డు షో కొనసాగింది. రోడ్డుకిరువైపులా నేతలు, కార్యకర్తలు నిలబడి నడ్డాకు ఘన స్వాగతం పలికారు. జై బీజేపీ, నడ్డా జిందాబాద్ నినాదాలతో హోరెత్తింది.

రోడో షో తర్వాత HICCలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను లాంచ్ చేశారు నడ్డా. ఎగ్జిబిషన్ లో తెలంగాణ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రంభీం, షోయాబుల్లాఖాన్ లాంటి యోధుల చరిత్ర తెలిపేలా ప్రదర్శన జరిగింది. కాసేపట్లో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్న రాజకీయ, ఆర్థిక అంశాలపై నడ్డా వీరితో చర్చించనున్నారు. రాత్రి 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, పేరణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత దరువు ఎల్లన్న నేతృత్వంలోని తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం నడ్డా అధ్యక్షతన జరుగనుంది.