జేపీ నడ్డా ఏపీ పర్యటన ఖరారు..

బిజెపి అగ్ర నేతలు వరుసగా రాష్ట్రాల పర్యటన చేస్తూ బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపుతున్నారు. రీసెంట్ గా తెలంగాణ లో ప్రధాని మోడీ పర్యటించగా..ఇప్పుడు ఏపీలో పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ తో పాటు జెపి నడ్డా కూడా పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనం.. షార్ సందర్శనకు మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. అధికారికంగా – రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు..జూలై 4న ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పుకొచ్చారు.

ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏపీలో పర్యటిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గం వెల్లడించింది. ఈ మేరకు పర్యటన వివరాలను వెల్లడించింది. జూన్ 6వ తేదీన విజయవాడకు చేరుకుంటారని, అక్కడ రాష్ట్ర స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ లతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం వేళ.. నగరంలోని పలువురు ప్రముఖులు, మేధావులతో సమావేశం కానున్నారు. జూన్ 7వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ రాజకీయాలు, బీజేపీ కీలక నిర్ణయాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. అలాగే వివిధ రంగాల ప్రముఖులతో చర్చించనున్నారు.