పెత్తందారులు విజయం సాధించాలని బాబు కుట్రలు – మంత్రి రమేష్

పెత్తందారులు విజయం సాధించాలని బాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని, ఈ పండుగకు అందరూ రావాలని జోగి రమేష్‌ ఆహ్వానించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చంద్రబాబు పెత్తందారుల పక్షాన నిలబడితే సీఎం వైయస్‌ జగన్‌ పేదల పక్షాన నిలబడి విజయం సాధించారని తెలిపారు. సమాధి అంటూ చంద్రబాబు విమర్శించిన ఆ సెంటు స్థలంలోనే.. పేదలు టీడీపీని సమాధి చేయబోతున్నారని అన్నారు.

‘‘51 వేల మందికి పైగా శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?’’ అని మండిపడ్డారు. పేదలు పనులకు మాత్రమే ఉపయోగపడాలా, అక్కడ నివసించకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నయా జమీందారీ వ్యవస్థ తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదలకు పట్టాలు ఇస్తుంటే వద్దని కొందరు మహిళా పెత్తందార్లను అడ్డుకోమంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.