పవన్ వాహనం వారాహి కాదు.. నారాహి – జోగి

పవన్ వారాహి వాహనం ఫై వైస్సార్సీపీ నేతల కామెంట్స్ ఆగడం లేదు. ఓ పక్క పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ వారు మాత్రం వారి కామెంట్స్ ను ఆపడం లేదు. తాజాగా మంత్రి జోగి రమేష్ పవన్ వాహనం పేరు వారాహి కాదు.. నారాహి అంటే సరిపోతుంది అంటూ కామెంట్స్ చేసారు.

గత ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్..ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా..పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఆదరణ పెరగడమే కాదు జనసేన ఫై నమ్మకం సైతం రెట్టింపు అయ్యింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ప్రజలు అంటున్నారు.

ఇక ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ..నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు. దసరా తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచార రథం కూడా సిద్ధమైంది.

దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. కాగా, ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించారు.

అయితే పవన్ బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. తాజాగా, వైస్సార్సీపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వాహనం పేరు వారాహి కాదు నారాహి అంటే సరిపోతుందని సెటైర్ వేశారు. చంద్రబాబుకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే ఉంటారని చెప్పమనండి, లేకపోతే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులే ఉంటారని, తానే సీఎం అభ్యర్థినని పవన్ కల్యాణ్ చెప్పగలడా? అని జోగి రమేశ్ నిలదీశారు. పవన్ ఒక పగటి వేషగాడు అని, చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధంగా ఉంటాడు అని విమర్శించారు.