సౌత్‌ కరోలినాలో బిడెన్‌ విజయం

Biden
Biden

సౌత్‌ కరోలినా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్నపోరులో అయోవా, న్యూహాంప్‌షైర్‌, నెవడాలో వరుసగా ఓటమి పాలైన జోయ్ బిడెన్‌ సౌత్‌ కరోలినా ప్రైమరీస్‌లో విజయం సాధించాడు. దీంతో సూపర్‌ ట్యూజ్‌డే (14 రాష్ట్రాల్లో ఒకే రోజు) ప్రైమరీస్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గెలుపుతో అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వ రేసులో బిడెన్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. సౌత్‌ కరోలినాలో ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండే బిడెన్‌ టాప్‌ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచారు. గత మూడు ప్రైమరీలలో ఆయన నాలుగో స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ప్రైమరీలో బిడెన్‌ 48.4 శాతం ఓట్లు సాధించి అగ్ర స్థానంలో ఉండగా, వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌కు 19.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బిడెన్‌ విజయానికి ఎక్కువగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ ఓటర్లు, 45 ఏళ్ల పైబడిన అమెరికన్‌ ఓటర్ల ఓటింగ్‌ దోహదపడినట్లు తెలుస్తోంది. సౌత్‌ కరోలినా ప్రైమరీకి ముందు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రతి పది మంది ఓటర్లలో ఎనిమది మంది బిడెన్‌పై మొగ్గు చూపగా, శాండర్స్‌పై ఐదుగురు మొగ్గు చూపారు. ఇక్కడి కాంగ్రెస్‌ ప్రతినిధి జేమ్స్‌ సిల్బర్న్‌ బిడెన్‌కు మద్దతు ప్రకటించటం తమ నిర్ణయానికి ప్రధాన కారణమని సౌత్‌ కరోలినా ఓటర్లలో పదింట ఆరుగురు చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/