నేడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం

సర్వాంగ సుందరంగా ముస్తాబైన అమెరికా ‘క్యాపిటల్‌’
అతిథుల కోసం విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా క‌మ‌లా హారిస్ నేడు ప్ర‌మాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో) జరుగనున్న బైడెన్‌ ప్రమాణానికి రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రెండువారాల క్రితం అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడులు పునరావృతంకాకుండా పాతిక వేల మంది నేషనల్‌ గార్డు బలగాలు డేగ కండ్లతో నిఘాను మరింత పటిష్ఠం చేశాయి. క్యాపిటల్‌ హిల్‌ భవనం వైపునకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించి రిహార్సల్స్‌లో భాగంగా క్యాపిటల్‌ భవనాన్ని అధికారులు సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాణం జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటనలు జరిగితే యంత్రాంగం ఎలా స్పందించాలన్న అంశంపై ఈ రిహార్సల్స్‌ నిర్వహించారు. మరోవైపు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్షుడి ప్రమాణానికి వెయ్యి మంది అతిథులనే అనుమతించబోతున్నట్టు సంబంధిత కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో చట్టసభ సభ్యులు, వారి బంధువులు ఉన్నట్టు పేర్కొంది.


కాగా, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే అతిథుల కోసం చ‌వులూరించే వంటకాలను సిద్ధం చేశారు. విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి. ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ ఆధ్వ‌ర్యంలో ఈ వంట‌లు చేశారు. కమలా హారిస్ బాగా ఇష్టప‌డే సీఫుడ్‌ గంబో సూప్‌ కూడా అతిథుల‌కు వ‌డ్డించ‌నున్నారు. షెల్‌ ఫిష్‌, కాప్సికం, ఉల్లిపాయల‌తో దీన్ని చేస్తారు. అతిథుల‌కు వ‌డ్డించే వంట‌కాల్లో పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్ లు కూడా ఉన్నాయి. వైట్‌ రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్ వంటివి కూడా మెనూలో ఉన్నాయి. అలాగే, బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్ స్వీట్ల‌ను కూడా అతిథులకు వడ్డిస్తారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/