కరోనా వ్యాక్సిన్ పై బైడెన్ కీలక వ్యాఖ్యలు

టీకా ముందు అమెరికన్లకు మిగిలితే ప్రపంచ దేశాలకు.. బైడెన్

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ విషయమై బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు అమెరికన్లు టీకా తీసుకోవడం పూర్తైన తర్వాత.. మిగిలితే ప్రపంచ దేశాలతో పంచుకుంటామన్నారు. తమ దేశ అవసరాలకు మించి అదనంగా వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగితే.. వాటిని ప్రపంచ దేశాలకు ఇస్తామని బైడెన్ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం తమ వద్ద ఉన్న టీకా డోసులకు అదనంగా మరో 100 మిలియన్ల మోతాదుల ఉత్పత్తి చేసేలా జాన్సన్ అండ్ జాన్సన్‌, మెర్క్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కొవ్యాక్స్ కార్యక్రమానికి 400 కోట్ల డాలర్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండడం పట్ల బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు. అయితే, ఇంకా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగి పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/