భారత్ లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలెస్ మేయర్

రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును నామినేట్ చేసిన అధ్యక్షుడు బైడెన్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును నామినేట్ చేశారు. గార్సెట్టి ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ సిటీ మేయర్ గా ఉన్నారు. ఈ నియామకానికి సంబంధించి తొలి నుంచి గార్సెట్టి పేరు వినిపిస్తోంది. బైడెన్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించి ఏడు నెలలు అయింది. యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత్ కు సంబంధించి ఆయన తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం ఇదే.

అమెరికన్‌ సెనేట్ ధ్రువీకరిస్తే 50 ఏండ్ల గార్సెట్టి.. రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ హయాంలో రాయబారిగా పనిచేసిన కెన్నత్‌ జస్టర్ స్థానంలో గార్సెట్టి నియమితులవుతారు. ఎరిక్‌.. 2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్‌ సభ్యులుగా పనిచేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం తెలిపింది.

గత ఎన్నికల సమయంలో ట్రంప్ కు మోడి బహిరంగంగానే మద్దతు పలికారు. అయితే, ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కాగా, బైడెన్ ఘన విజయం సాధించారు. మరోవైపు, తన హయాంలో కూడా భారత్ తో అమెరికా బంధాలు బలంగా ఉండాలని బైడెన్ కూడా కోరుకుంటున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/