మోర్బీ ఘటన..మృతులకు అధ్యక్షుడు బైడన్‌ సంతాపం

president-joe-biden

వాషింగ్టన్ః గుజరాత్‌లో మోర్బీ ఘటనలో 141 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఇవాళ మా హృదయాలు భారత్‌తో ఉన్నాయని, వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తాను, జిల్‌ బైడెన్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని బైడెన్‌ ట్వీట్‌ చేశారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.

కాగా, గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో మచ్చు నదిపై చోటుచేసుకొన్న కేబుల్‌ బ్రిడ్జి రెండురోజుల కిందట కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో సోమవారం నాటికి మృతుల సంఖ్య 141కి చేరింది. ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలే మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయినవారిని గాలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న వంతెనకు ఇటీవల మరమ్మతులు పూర్తి చేశారు.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే పునః ప్రారంభిచిన కొద్ది రోజుల్లోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ వంతెనను 1879లో నిర్మించారు. దీని వెడల్పు 1.25 మీటర్లు కాగా, పొడవు 233 మీటర్లు. దర్బార్‌గద్‌ ప్యాలెస్‌, నజర్‌బాగ్‌ ప్యాలెస్‌ను కలిపేందుకు అప్పటి పాలకుడు సర్‌ వాఘ్‌జీ ఠాకూర్‌ దీన్ని నిర్మించారు. బ్రిడ్జికి మరమ్మతులు చేయాల్సి రావడంతో ఈ ఏడాది మార్చిలో దీన్ని మూసేశారు. ఓరెవా కంపెనీకి 15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న మళ్లీ రీ ఓపెన్‌ చేశారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరుగడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/