జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలు రద్దు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో గత నెలనే పునరుద్ధరించబడిన 2జి ఇంటర్నెట్, మొబైల్ సేవలు ఆదివారం మరోసారి రద్దయ్యాయి. పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు వర్థంతి సందర్భంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ పట్టణంలో కొద్దిపాటి ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ కాశ్మీర్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో శ్రీనగర్ పట్టణ వీధులు జనసంచారం లేక బోసిపోయాయి. పలు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థపై దాదాపు ఐదు నెలల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జనవరి 25 తర్వాత కాశ్మీర్ రీజియన్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/