జీవకేతుడి తపస్సు

జీవకేతుడి తపస్సు

వాల్మీకపురంలో జీవకేతుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు బ్రహ్మదేవుని గురించి చేయాలనే సంకల్పం కలిగింది. వెంటనే పద్మాసనం వేసుకుని బ్రహ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మ సాక్షాత్కారం కలగలేదు. జీవకేతుడికి కోపం వచ్చింది. బ్రహ్మదేవుడు కఠినాత్ముడు అనుకున్నాడు.

వెంటనే ఓ ఆలోచన వచ్చింది. పరమేశ్వరుడు భోళాశంకరుడు.భక్తవశంకరుడు. సులభసాధ్యుడు. భస్మాసురుడికి వరం ఇచ్చి తనకే ఆపద కొని తెచ్చుకున్న కరుణాహృదయుడు. ఆయనకు దేవదానవులన్న పక్షపాతం లేదు. అలాంటి శివుడి గురించి తపస్సు చేయకుండా బ్రహ్మ గురించి ఎందుకు తపస్సు చేశానా అని జీవకేతుడు బాధపడి శీర్షాసనం వేసి తలక్రిందులుగా పరమేశ్వరుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు.

చాలా సంవత్సరాలు గడిచాయి. జీవకేతుడి తపస్సు కఠినంగా సాగింది. అయితే పరమేశ్వరుడు మాత్రం అతనికి ప్రత్యక్షం కావడం లేదు. శివుడు తను అంత దీక్షగా తపస్సు చేస్తున్నా ఎందుకు జాలిపడడం లేదో జీవకేతుడికి అర్ధం కాలేదు. శివుడి మీద కోపం వచ్చింది.
శ్రీమహావిష్ణువు జ్ఞాపకం వచ్చాడు. బ్రహ్మకంటే, శివుడి కంటే విష్ణువే అన్ని విధాలా గొప్పవాడు అనిపించాడు. ఎందుకంటే గజేంద్రుని రక్షించడంలో విష్ణువు తన్ను తాను మరిచిపోయాడు. ఆయుధాన్ని కూడా ధరించకుండా వైకుంఠం వదిలి బయలుదేరాడు. ఆయన వెంట సుదర్శన చక్రం, శంఖం, గదాయుధం బయలుదేరాయి.

అలాంటి దయామయుడైన మహావిష్ణువు గురించి తపస్సు చేయకుండా అనవసరంగా బ్రహ్మ, శివుల గురించి తపస్సు చేసి విలువైన సంవత్సరాలు వృధా చేశానని అనిపించి అగ్నిలో నిలబడి మహావిష్ణువు గురించి భయంకర తపస్సు ఉగ్రంగా చేయడం మొదలు పెట్టాడు జీవకేతుడు. అయితే పాపం ఎంత కాలం తపస్సు చేసినా జీవకేతుడికి విష్ణువు దర్శనం కాలేదు. విష్ణువు మీద కోపం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ తనని కనికనించలేదు. ఇంక ఎవరి గురించి తపస్సు చెయ్యాలో జీవకేతుడికి అర్ధం కాలేదు. తన మీద తనకే జాలివేసి అసహ్యం వేసింది. వారి దర్శనం కాని తాను బ్రతకడం అనవసరం అనుకున్నాడు.

తాను పరమ పాపాత్ముడు అని భావించాడు. తనవంటి పాపాత్ముడు బ్రతకడం భూమికి భారం అని భావించి తన కంఠం నరుక్కోవాలనుకున్నాడు. అంతే! అతని ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. జీవకేతుడు ఆశ్చర్యానందాలతో తలమునకలవుతూ వారికి సాష్టాంగపడి త్రిమూర్తులారా నేను మనసా వాచా తపస్సు చేస్తే కనికరించని మీరు ఆత్మార్పణ చేసుకుంటుంటే ఎందుకు ప్రత్యక్షమయ్యారు? అని అడిగాడు.

వారు అతని వంక వాత్సల్యంగా చూస్తూ నీలో ఇంతకాలం అహంకారం, అసహనం, కోపం వంటి మేఘాలు ఆవరించి ఉండటం వల్ల మా కృపాకిరణాలు నీపై ప్రసరించడం కుదరలేదు. నేడు నీలో ఆ మేఘాలు తొలగిపోయాయి. అందుకే నీకు మేం ముగ్గురం ప్రత్యక్షమయ్యాము. ప్రతి వ్యక్తికీ పట్టుదలా, కృషి ఉంటే సరిపోదు. ఓర్పు కూడా కావాలి అంటూ వివరించి మోక్షాన్ని ప్రసాదించారు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/