స్పైస్‌జెట్‌ ఆఫీసు ముందు ఉద్యోగం కోసం జెట్‌ పైలెట్లు

Boeing 737 Max 8 jet
Boeing 737 Max 8 jet

న్యూఢిల్లీ, : ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి అంటే ఇదేనేమో, ఒకప్పుడు దర్జాగా జంబో జెట్‌ బోయింగ్‌ విమానాలు నడిపిన జెట్‌ఎయిర్‌వేస్‌ పైలట్లు విధి వక్రించడంతో ఇప్పుడు సాధారణ విమానాలు నడిపేందుకు లైనులో నిలబడ్డారు. వేతనం ఎంతైనా సరే, ఉద్యోగం ఇస్తే చాలు అనే పరిస్థితికి దిగజారారు. దివాళా అంచుల్లో ఉన్న ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ జెట్‌ఎయిర్‌వేస్‌ నుంచి సుమారు 260 మంది పైలెట్లు బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌గా పేర్కొందిన స్పైస్‌జెట్‌లో ఉద్యోగం కోసం లైను కట్టారు. అయితే ఒకప్పుడు ఈ పైలెట్లు అంతా బోయింగ్‌ 737 నడిపే సామర్థ్యం కలవారే కావడం విశేషం. పైలట్లతో పాటు ఎయిర్‌క్రాప్ట్‌ ఇంజినీర్లు, అలాగే సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అంతా ఎవరికి వారు వేరే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, మున్ముందు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గం చూసుకోకతప్పడం లేదని జెట్‌ఎయిర్‌వేస్‌ సిబ్బంది వాపోతున్నారు. స్పైస్‌జెట్‌ మాత్రమే కాదు, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కూడా పైలెట్లు ఉద్యోగం కోసం క్యూకట్టినట్లు తెలుస్తోంది. నిజానికి స్పైస్‌జెట్‌ తక్కువ బడ్జెట్‌ విమాన సర్వీసులు నడుపుతుంది. అయినప్పటికీ బోయింగ్‌ విమానాలు నడిపే పైలట్లు కూడా ఉద్యోగం కోసం లైను కట్టడం విశేషం. అయితే మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లు వేతనాలు పొందే అవకాశం లేదని జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే బోయింగ్‌ 737 విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అటు బోయింగ్‌ విమానాలు నడిపే జెట్‌ఎయిర్‌వేస్‌ పైలెట్లు ఇప్పుడు సాధారణ విమానాలు నడిపేందుకు సిద్ధమైపోతున్నారు.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయరడి :