దీనులకే దేవుడి రాజ్యంలో చోటు..

అంతర్వాణి

Jesus
Jesus

కేరళలో ఇటీవల సిస్టర్‌ అభయ అనే నన్‌ హత్య కేసులో ఒక పాస్టర్‌కు, మరొక సిస్టర్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. 28ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన సిస్టర్‌ అభయ అనే నన్‌ ఆత్మహత్యగా మొదట భావించినా, తర్వాత అనేక మలుపులు తిరిగిన కేసు ఎట్టకేలకు ఆమెది ఆత్మహత్య కాదు, హత్యగా సిబిఐ సుదీర్ఘ విచారణ ద్వారా న్యాయస్థానంలో నిరూపించింది.

దీంతో నిందితులకు యావజ్జీవకారాగార శిక్షను విధించారు. పాస్టర్‌ థామస్‌ కట్టుర్‌, సిస్టర్‌ షీఫీ మధ్య నెలకొన్న సంబంధం సిస్టర్‌ అభయ ఆ దృశ్యాన్ని చూడ్డం వెరసి ఆమె హత్యకు దారితీసింది. ఈ కేసులో నిందితులు తమ నేరం నుంచి తప్పించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు.

చివరికి ఒక దొంగ ప్రత్యక్షసాక్షిగా నిలబడి, ఆరోజు పాస్టర్‌ థామస్‌ను చూసినట్లుగా బలమైన సాక్ష్యం చెప్పండం వల్ల కోర్టు దోషులకు శిక్షను విధించింది. వీరిద్దరిది సంబంధం ఎలాంటిదైనా దేవుడిని వెంబడించేవారు అనగా విశ్వాసులు తాము నీతిమంతులుగా భావిస్తూ, ఇతరులను తృణీకరిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంతరంగంలో తాము నీతిమంతులుగా అనుకుంటూ, గర్విస్తుంటారు.

ఎందుకంటే మనం హత్యలు చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనాలు చేయకపోవచ్చు అయినంత మాత్రాన మనం నీతిమంతులం కాము. సొంత మామతోనే పాపం చేసి, సంతానాన్ని పొందిన తామారు అనే మహిళ, ఐదుగురి భర్తలకు విడాకులిచ్చి, ఆరవ వ్యక్తితో జీవిస్తున్న సమయరస్త్రీ, వేగులవారికి ఆశ్రయం ఇచ్చిన రాహాబు అనే వేశ్య వీరంతా పాపులే. కానీ దేవుడి దృష్టిలో వీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు.

పరిశుద్ధ గ్రంధంలో కూడా వీరిని నీతిమంతులుగా దేవ్ఞడు పొందుపరి చాడు. వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు వీరంతా మనకంటే ముందుగా దేవుడి రాజ్యం లో ఉంటారని యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. మనచుట్టూ అనేక నేరాలు, ఘోరాలు జరుగుతుం టాయి. సంఘంలో అల్పవిశ్వాసులు ఉంటారు, పడిపోయిన వారు వుటారు. అవి శ్వాసులు కూడా ఉండాలి. వీరిని చూసి మనం గర్వించకూడదు.

పైకి మనం ఎంతో విధేయులుగా కనిపిస్తాం. కానీ అంతరంగంలో ఇతరులతో పోల్చుకుని, గర్వించే బలహీనమైన మనసు మనకు ఉంటుంది. ‘దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును (యాకోబు 4:6), ‘దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును (1 పేతురు 5:5).

మనం ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నామంలో హతసాక్షులైన శిష్యులతో పోల్చుకోవాలే తప్ప బలహీనులో కాదు. కాబట్టి విశ్వాసులు తమ ప్రార్థనాజీవితం బట్టి, భక్తి జీవితాన్ని బట్టి అతిశయించే భావాలకు దూరంగా ఉండాలి. దీనత్వంతో ప్రభువును సేవించడం ఒక్కటే మనకున్న విధి.

ఎందుకంటే యేసు ప్రభువు తన కొండమీది ప్రసంగంలో మొట్టమొదటగా చెప్పింది, ‘ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది (మత్తయి 5:3). దేవుడి రాజ్యంలో దీనులకే తప్ప అహంకారులకు చోటు ఉండదనే వాస్తవాన్ని గ్రహించి, దీనత్వంతో దేవుడిని సేవిద్దాం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/