బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా – జీవిత రాజశేఖర్

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తా అన్నారు నటి , బిజెపి నేత జీవిత రాజశేఖర్. గురువారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి( మం) కొప్పూరు గద్దల బండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కుండ చికెన్ కుమార్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని అన్నారు. కరోనా సమయంలో తన భర్త రాజశేఖర్ కు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి అభిమానులు ఇచ్చిన మద్దతును జీవితంలో మర్చిపోలేమని తెలిపారు. బతుకు జట్కా బండి కార్యక్రమం ద్వారా కొన్ని వేల కుటుంబాలను ఏకం చేసే అదృష్టం దక్కిందని చెప్పుకొచ్చారు. మంచి అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పకుండా సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేశారు. ప్రతి నటుడు గ్రామీణ స్థాయి నుంచి వచ్చి, కష్టపడి, ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్న వారేనని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాలనుంచి వస్తున్న కళాకారులను ప్రతి ఒక్కరు ఆదరించాలని జీవిత కోరారు. ఇక బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు.