బీజేపీ గోదావరి గర్జన సభ లో జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వం ఫై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బిజెపి గోదావరి గర్జన సభ సక్సెస్ కావడం తో నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ లో వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై బిజెపి నేతలు తీవ్ర విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టగా..ఇక జయప్రద ఓ రేంజ్ లో జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు జయప్రద క్షమాపణలు కోరారు. రాజమండ్రి తన స్వస్థలమని.. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్లినట్లు చెప్పారు. మన ఊరు, మనవాళ్లను వదిలి వెళ్లినందుకు క్షమించండి అంటూ తెలుగు ప్రజలను కోరారు. తాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పని చేయలేదు. ఏపీలో రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు.. కానీ పేదలకు ఒరిగిందేమీ లేదు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. బిజెపి గర్జనకు మద్దతిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బిజెపిని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది’ అని పార్టీ శ్రేణులకు జయప్రద పిలుపునిచ్చారు.