ఉత్తరాంధ్ర దిశగా ‘జవాద్’ తీవ్ర వాయుగుండం

నేటి సాయంత్రానికి తుపానుగా బలపడనున్న వాయుగుండం

అమరావతి: ఉత్తరాంధ్ర మరోమారు వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా వేగంగా కదులుతోంది. నేటి సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అనంతరం నేటి సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గాలుల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లుండి వరకు జాలర్లు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు.

జవాద్‌గా పిలుస్తున్న ఈ తుపాను రేపు ఉదయానికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. అలాగే, తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం నియమించింది.

ప్రభుత్వ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక రోజు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నేటి నుంచి ఎల్లుండి వరకు విశాఖలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, నేడు బయలుదేరాల్సిన పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు.

జవాద్ తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై ప్రధానమంత్రి మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తుపాను ముప్పు తీవ్రంగా ఉండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వశాఖలతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్షించారు. కోస్టుగార్డు, నేవీ హెలికాప్టర్లు, నౌకలను సిద్ధం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/