నాకో ప్రేయసి కావాలి: జపాన్ బిలియనీర్‌

తన ప్రేయసిని చంద్రుడి వద్దకు తీసుకెళ్తానని ప్రకటన

Japanese billionaire
Japanese billionaire

టోక్యో: జపాన్ బిలియనీర్‌, ఆన్‌లైన్ ఫ్యాషన్ సంస్థ జొజొ అధినేత యుసాకు మేజావా(44) తనకు ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన చేశాడు. 20 ఏళ్లు నిండిన ఒంటరి యువతులు దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. ఎంపికైన అమ్మాయిని తాను స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో చంద్రుని చుట్టూ తిప్పుతానని చెప్పాడు. కాగా, ఆయన ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని విడిపోయాడు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. భార్య లేకపోవడంతో తాను ఒంటరితనంతో బాధపడుతున్నానని అంటున్నాడు. చంద్రుడిపైకి ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు? అంటూ ఆయన తన ప్రేయసి కోసం ప్రకటన చేశాడు. తన ప్రేయసి పోస్టుకు ఈ ఏడాది జనవరి 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నాడు. కోటీశ్వరుడయిన మేజావా జనవరి 1న తాను చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇవ్వడం గమనార్హం. ఇటీవల తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయిన వారికి కోట్లాది రూపాయలను బహుమతిగా అందించాడు కూడా. ఇలా పదే పదే ఏదో ఒక పని చేసి ఆయన వార్తల్లో నిలుస్తుంటాడు.

టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ చేపట్టిన స్పేస్‌ఎక్స్ ప్రాజెక్టుపై యుసాకు మేజావా సంతకం చేశాడు. 2023లో చంద్రుడిని చుట్టి రానున్న మొదటి ప్రైవేట్ ప్రయాణికుడిగా ఆయన నిలిచాడు. తనతో పాటు తనకు కాబోయే ప్రేయసిని కూడా చంద్రుడి వద్దకు తీసుకెళ్తానని అంటున్నాడు. ఆయన చేసిన ప్రకటనకు ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూడాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/