పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న

జనశక్తి అగ్రనేత కూర రాజన్న అలియాస్ KRను హైదరాబాద్ లో వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రావు హత్య కేసులో 2013లో కూర రాజన్నకు వారెంట్ జారీ అయింది. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన రాజన్న జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్న పై నాన్ బేలబుల్ వారంట్ జారీ అయింది. అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు అత్యంగా గోప్యంగా ఉంచారు.

ఇటివల జిల్లాలో జరిగిన వరుస ఘటనలతో అలర్ట్ అయిన పోలీసులు రాజన్నను అదుపులోకి తీసుకున్నారు. జనశక్తి ప్రాబల్యం తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యలతో రాజన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాగా నిన్న రాజన్న ను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు. రాజన్న అరెస్ట్ ను ఖండిస్తూ సీపీఐ ఎంల్ న్యూడెక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రకటన విడుదల చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.