పులిచింత‌ల డ్యామ్ గేటు విరిగిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం

నిపుణులు తొలి నుంచి చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు : జ‌నసేన‌

అమరావతి : ఏపీ లోని కృష్ణా జిల్లా పులిచింత‌ల డ్యామ్ 16వ నంబర్‌ గేటు విరిగిపోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌న‌సేన పార్టీ నేత నాందెడ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ఎంత సుర‌క్షితంగా ఉందో గేట్ల నాణ్య‌త‌, వాటి ప‌ని తీరు ఆధారంగా ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. అలాంటిది జ‌ల ప్ర‌వాహం ధాటికి గేటు విరిగిపోవ‌డం, అందుకు సంబంధించి యాంక‌ర్ తెగిపోవ‌డం చూస్తుంటే ఆ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ అంశాల‌పై భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని చెబుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ ప్రాజెక్టు లోప‌భూయిష్టంగా ఉంద‌ని జ‌ల వ‌న‌రుల ఇంజ‌నీరింగ్ నిపుణులు మొద‌టి నుంచీ చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్నది వాస్త‌వ‌మ‌ని అన్నారు. పులిచింత‌ల ప్రాజెక్టు ఏ మేర‌కు ప‌దిలం? అన్న విష‌యాన్ని నిగ్గు తేల్చడంతో పాటు లోపాలు ఎలా చ‌క్క‌దిద్దాల‌న్న విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయడానికి ఉన్న‌త‌స్థాయి నిపుణుల క‌మిటీని నియ‌మించాల‌ని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/