రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం అవసరం – నాగబాబు

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. బుధువారం బుధవారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నాగబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని, అధికార మదంతో రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం పతనం చేస్తోందని, ఈ పరిస్థితులలో జనసేన లాంటి పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారని అన్నారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నాగబాబు స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. వైఎస్సార్‌సీపీ పాలన ఎలా ఉందో ప్రజలకే బాగా తెలుసని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం గడపగడపకు వెళ్తుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసన్నారు.

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు మెగా బ్రదర్ తెలిపారు. త్వరలో అన్ని నియోజవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తామని.. ఉత్తరాంధ్రలో జనసైనికుల్లో జోష్‌ నింపేందుకు తాను వచ్చానన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాని.. నియోజకవర్గాలవారీ పార్టీ శ్రేణులతో చర్చించిన అంశాలను మా పీఏసీ దృష్టికి తీసుకువెళతాను అన్నారు.

జనసేన పార్టీకి ప్రజల నుంచి రోజురోజు ఆదరణ పెరుగుతోందని, దానిని మరింతగా పెంచుకోవడానికి ప్రజా సమస్యలపై జనసైనికులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం బాగుండటమే కాకుండా భవిష్యత్‌ తరాల ప్రయోజనాలకోసం కూడా పవన్‌ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్న ఆశతో ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రయోజ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్భాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడానన్నారు. జన సైనికులలో ఎక్కువ శాతం మేధావులు, విద్యావంతులు, ఐ.టీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వారందరి ఆలోచన విధానం, మేధస్సు, పార్టీ గెలుపు కోసం వారు చేస్తున్న కృషి అమూల్యమైనది అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని.. ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారన్నారు.