చంద్రబాబు, జగన్ దొందూ దొందే

ట్విట్టర్ లో జనసేన స్పందన

janasena
janasena

అమరావతి: రాష్ట్రంలో బాక్సైట్ అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ జనసేన పార్టీ ధ్వజమెత్తింది. నాడు చంద్రబాబు అక్రమ బాక్సైట్ మైనింగ్ ను దగ్గరుండి ప్రోత్సహిస్తే, నేడు అదే కంపెనీని జగన్ అక్కున చేర్చుకున్నారని ఆరోపించింది. ప్రకృతి సంపదను దోచుకోవడంలో దొందూ దొందేనని జనసేనాని పవన్ కల్యాణ్ అప్పుడే చెప్పారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా ఉదహరించారు. చంద్రబాబు అండతో అక్రమ మైనింగ్ కు పాల్పడిన సంస్థ నుంచి వైఎస్‌ఆర్‌సిపికి భారీగా విరాళాలు అందాయని జనసేన ట్విట్టర్ లో ఆరోపించింది. వంతాడలో ప్రకృతికి విఘాతం కలిగిస్తున్న కంపెనీ నుంచి కోట్ల రూపాయలు విరాళంగా పొందారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆండ్రూస్ కంపెనీ నుంచి రూ.9.5 కోట్లు వైఎస్‌ఆర్‌సిపికి విరాళం రూపంలో అందాయని, కంపెనీకి సంబంధించిన వ్యక్తుల నుంచి మరో రూ.1.5 కోట్ల రూపాయలు అందుకున్నారని వివరించారు. అక్రమ మైనింగ్ ను నాడు టిడిపి ముందుండి ప్రోత్సహిస్తే నేడు వైఎస్‌ఆర్‌సిపి వెనకుండి వెనకేసుకొస్తోందని జనసేన వర్గాలు విమర్శించాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/