‘ధర్మ పరిరక్షణ’ దీక్షకు దిగిన పవన్
దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై నిరసన

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ధర్మ పరిరక్షణ దీక్ష’కు దిగారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన ఘటనతో పాటు హిందూ దేవాలయాల విషయంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను నిరసిస్తూ ఈ దీక్షకు దిగినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. ‘దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా, జనసేన- బిజెపి సంయుక్తంగా పిలుపునిచ్చిన ‘ధర్మ పరిరక్షణ దీక్ష’ లో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ ఇందులో పాల్గొన్నారు’ అంటూ జనసేన ప్రకటన చేసింది. దేవాదాయ ఆస్తులను కాపాడాలని జనసేన డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలు చేయాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు దీక్ష చేపడుతున్నారు. బిజెపి నేతలు, కార్యకర్తలు కూడా తమ ఇళ్ల వద్ద దీక్షలు చేపట్టారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/