దేనికీ గర్జనలు?.. రోడ్లు వేయనందుకా?: జగన్‌కు పవన్‌ ప్రశ్నలు

ఈ నెల 15న వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వరంలో ‘విశాఖ గర్జన’

janasena-chief-pawan-fires-on-cm-jagan

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సిఎం జగన్‌ పై పలు ప్రశ్నలు సంధించారు. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో రాజకీయేతర జేఏసీ ర్యాలీ చేపట్టనుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్.. దేనికీ గర్జనలు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి తాజాగా పలు ప్రశ్నలు సంధించారు.

దేనికీ గర్జనలు?.. రోడ్లు వేయనందుకా? చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వనందుకా? అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా? ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనందుకా? విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా? ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా? విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా? విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/