ఏపీ విద్యుత్ చార్జీల పెంపు..నేడు కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన

విద్యుత్ చార్జీలపై దిగి వచ్చే వరకూ పోరాటం అంటున్న పవన్ కళ్యాణ్

అమరావతి: ఏపీలో విద్యుత్ చార్జీల‌ను పెంచుతూ వైస్సార్సీపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఒక్కసారి పవర్‌ ఇవ్వండి.. నా పవర్‌ ఏమిటో చూపిస్తా అంటూ వైస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచి.. తన పవర్‌ను ఈ విధంగా చూపించిందన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా విద్యుత్ చార్జీలను పెంచిందని.. పెంచిన చార్జీలు తగ్గించే వరకూ జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు’ అని పవన్‌ పేర్కొన్నారు.

ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్‌ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్‌ ఛార్జీల పేరిట మరో రూ.3 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని జనసేనాని మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి ఆ విషయాన్ని మరిచిపోయారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.20 లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/