సూర్యాపేట జిల్లాలో ‘జై భీమ్’ సీన్ రిపీట్..

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా సూర్య జై భీమ్ మూవీ అందర్నీ కట్టిపడేస్తుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజ జీవిత కథ తో తెరకెక్కించారు. ఈ మూవీ లో అన్యాయంగా ఓ అమాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసి..ఆ కేసును ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడతారు. చివరకు అమాయకుడు పోలీసులు కొట్టిన దెబ్బలకు మరణిస్తాడు. ఇప్పుడు ఇదే తరహా లో సూర్య పేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరులో ఐదు రోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే.. నవీన్ అనే వ్యక్తి కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్‌ లో విచారించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా తనతో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు చోరీలో పాల్గొన్నట్లు నవీన్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే వారిలో ధరావత్ వీరశేఖర్ అనే రైతు ఉన్నాడు. తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించారు. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాడు. తాను ఏ తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లారని.. బాగా కొట్టారని.. ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పలేదని వాపోయాడు వీరశేఖర్‌.

విచారణ తర్వాత ఇంటికి వెళ్లిన వీరశేఖర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు ఉబ్బిపోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి తర్వాత పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. వీరశేఖర్‌ను హింసించిన ఎస్ఐ‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి ఈ విషయం బయటికి పొక్కకుండా ఎస్ఐ కాళ్లబేరానికి వచ్చాడు. పెద్ద మనుషుల ద్వారా ఈ వ్యవహారాన్ని రాజీ చేసినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.