ఏపీలో మరో రాజకీయ పార్టీ వెలిసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ వెలిసింది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో జడ శ్రవణ్‌కుమార్ ఈ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నారు. 28 సంవత్సరాలకే న్యాయమూర్తి అయిన తాను పదేళ్లలోనే ఆ పదవిని వదిలి వచ్చేశానని తెలిపారు.దళిత బిడ్డలకు తాను మేనమామలా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వారికి చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోబోమన్నారు.

దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసిన నిందితులను శిక్షించలేని దుర్మార్గపు పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దళితుల సమస్యలు పరిష్కరించని, దాడులపై స్పందించని వైసీపీలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. దళితులకు అందే 26 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. రూపాయికి కిలో బియ్యం, రూ. 200కు నూనె ప్యాకెట్ ఇచ్చే వారిని పొగుడుదామా? అని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నించకుండా వదలనని శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.