తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని స్పష్టం చేసిన జగ్గారెడ్డి

Jagga Reddy
Jagga Reddy

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయబోతున్నాడనే వార్తలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్​ పార్టీలోనే ఉంటానని.. తాను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేసారు. అయితే త‌న వ‌ల్ల ఇబ్బంది అంటే.. అప్పుడు అలోచిస్తాన‌ని అన్నారు. ఏ కార‌ణం నుంచి అయిన తాను కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే సోనియా గాంధీ కుటుంబానికి గౌర‌వం గానే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఇత‌ర పార్టీల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు. ఇండిపెండెంట్ గానే ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని.. అలాంటి పార్టీకి దూరం కావాల‌ని ఎవ‌రూ అనుకోర‌ని అన్నారు. సంక్రాంతి త‌ర్వాత సోనియా గాంధీని క‌లిసిన త‌ర్వాత అన్ని విష‌యాలు చెబుతాన‌ని అన్నారు.

అలాగే లే ఔట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోనూ ఇళ్లు, స్థలాలు క్రమబద్ధీకరించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుని ఉంటారని.. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని గ్రామపంచాయతీల్లో అక్రమ ప్లాట్లు, ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 8న ఇందిరాపార్క్​ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. కొవిడ్​ నిబంధనలకు లోబడి 10మందితో దీక్ష చేస్తామన్నారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.