కేసీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపిన జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆరోగ్య మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్, హరీష్ రావుకు ధన్యవాదాలు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని, అసెంబ్లీలో మెడికల్ కాలేజీ కోసం తాను పోరాడినట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి పనులు చేయకపోతే చేయలేదంటామని, పనులు అయితే అయ్యాయని చెబుతామంటూ జగ్గారెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రకటిస్తే,..హరీష్ రావు వేగంగా పనులు జరిగేలా చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా తాను ఉన్న సమయంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కేటాయించిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు.

ఇక సంగారెడ్డితో పాటు జగిత్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాలలో కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి వర్చవల్‌గా క్లాసులను కేసీఆర్ ప్రారంభించారు. త్వరలోనే మిగతా జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలోని 16 జిల్లాలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మిగతా 17 జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.