రాజీనామా ఫై జగ్గారెడ్డి క్లారిటీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నిత్యం ఏదొక వివాదం నడుస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెపుతున్నప్పటికీ..నేతలు మాత్రం అవేమి పట్టించుకోకుండా వర్గాలుగా మారి వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా టీపీసీసీ కమిటీల నివేదిక ఇప్పుడు నేతల మధ్య ఉన్న అసహనాన్ని బయటకు తీస్తుంది. సీనియర్లను కాదని..కొత్తగా పార్టీ లో చేరిన వారికీ పదవులు అప్పగించడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సీనియర్ నేతలంతా భేటీ అయ్యి..కాంగ్రెస్‌లో సీనియర్లపై కోవర్టులమని ముద్ర వేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న తమను కోవర్టులు అంటారా? అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటె టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామాపై సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయనంటూ తేల్చేశారు. తనకు రాజీనామా చేసే ఆలోచన ఇప్పట్లో లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తామే కాపాడుతున్నామని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వలస నాయకుడి చేతిలో పెట్టారని, టీపీసీసీ అధ్యక్షుడిపైనే తమ అభ్యంతరమని తెలిపారు. రేవంత్ హటావో… కాంగ్రెస్ బచావో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమని, వలస నాయకుడు రేవంత్ పెత్తనం ఏంటి? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి క్యారెక్టర్, కమిట్‌మెంట్ లేదని ఆరోపించారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్‌ను కాపాడుకుంటామని, తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే చస్తామన్నారు.