దైవాధీనం జగత్సర్వం

దైవాధీనం జగత్సర్వం
Lord Krishna

రెండు సేవల మధ్య రధాన్ని నిలుపమని శ్రీకృష్ణుడిని కోరాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు. కౌరవసేనలోని వీరులనందరినీ బాగా చూడమన్నాడు. అర్జునుడు కౌరవసేనలోని వారినీ, తన సేనలోని వారినీ అందరినీ చూశాడు. పెదతండ్రులు, పినతండ్రులు, తాతముత్తాతలు, గురువ్ఞలు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మామలు, మిత్రులు కనపడ్డారు. అర్జునునికి నోరు ఎండిపోయింది. శరీరంలో వణుకు, గగుర్బాటు కలిగాయి. చేతిలోని గాండీవం జారిపోయింది. నిలబడలేకపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు ‘అపశకునాలు కనపడుతున్నాయి. కులనాశనము వల్ల కలిగే దోషాలు వారికి తెలియకపోవచ్చు. కానీ మనకు తెలుసు, కులక్షయమువలన కులధర్మాలు నశిస్తాడు. పాపము వ్యాపిస్తుంది. అధర్మం పెచ్చుపెరిగిపోతుంది. కులస్త్రీలు దూషితులవ్ఞతారు, వర్ణసాంకర్యం ఏర్పడుతుంది, వర్ణసాంకర్యము కుల ఘాతకులను, కులమును నరకమున పడవేయును, పిండోదకములు లోపిస్తాయి. పితరులు అధోగతి పాలవ్ఞతారు. సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమవ్ఞతాయి. తత్ఫలితంగా నరకము వస్తుంది. కాబట్టి ఓ కృష్ణా! నేను యుద్ధం చేయను, నాకు రాజ్యము వద్దు, విజయము వద్దు, నన్ను వారు చంపినా పర్వాలేదు ఇలా పల్కి అర్జునుడు ధనుర్బాణాలను విడిచి రధము వెనుక భాగంలో చతికిలబడ్డాడు. అజ్ఞానంలో, మోహంలో వ్ఞన్న మనం ఏమేమి అంటాయో, ఏమేవిూ లెక్కిస్తామో, ఏమేమి చేస్తామో సరిగ్గా అలాగే చేశాడు మోహంలో, అజ్ఞానంలో వ్ఞన్న అర్జునుడు. మనం మంచి శకునాలు అపశకునాలు అని లెక్కిస్తాం, పుట్టుకతోనే కులం కలుగుతుందనుకొంటాము. అలా అనుకొని ‘కులం అంటూ కులుకుతుంటాం.

కులవృత్తులనే అంటిపెట్టుకోవాలనుకొంటాం. కులాచారాలను గుడ్డిగా పాటిస్తాం. పెద్దకులం చిన్నకులం అంటాం, కులం అలాగే చిరకాలం ఉండాలనుకొంటాం, కుల పురుషులు చెడిపోయినా పర్వాలేదుగానీ కులస్త్రీలు చెడిపోకూడదనుకొంటాం. (పురుషుడు ఏస్త్రీతోనైనా సంబంధం పెట్టుకోవచ్చుగానీ, స్త్రీ అలా చేస్తే చెడిపోవడమంట), వర్ణసాంకర్యం కలుగరాదనుకొంటాం. పిండోదకాలు పెట్టే ఆచారం కొనసాగాలనీ, అలా జరక్కపోతే పితరులు అధోగతి పాలవ్ఞతారనీ, కులధర్మాలు, జాతిధర్మాలు నశించి ఘోరనరకం సంభవిస్తుందని అనుకొంటాం. సరిగ్గా అలాగే అనుకొన్నాడు అర్జునుడు. యుద్ధం చేయనని భీష్మించుకుని కూర్చొన్నాడు. ఆ ఆలోచనలన్నీ సరియైనవి కావన్నాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.


యుద్ధం జరుగరాదని అర్జునుడు భావిస్తే యుద్ధాన్ని జరిపించాడు శ్రీకృష్ణుడు. అపశకునాలు కనపడుతున్నాయి అని బెదురుతున్న అర్జునునకు యుద్ధంలో విజయాన్ని చేకూర్చిపెట్టి ధర్మం, దైవం తోడుంటే శకునాలు ముఖ్యం కాదని నిరూపించాడు. గుణకర్మలను బట్టే వర్ణంగానీ, పుట్టుకను బట్టి కాదన్నాడు. అర్జునుడు ఏమేమి జరగారాదనుకొన్నాడో అవన్నీ జరిగేట్టు చేశాడు శ్రీకృష్ణుడు. యుద్ధం జరిగింది. వర్ణసాంకర్యం జరిగింది (అదే మంచిదంటుంది నేటి విజ్ఞానశాస్త్రం. హైబ్రిడ్‌ పంటలు, హైబ్రిడ్‌ పశువ్ఞలు, హైబ్రిడ్‌ మనుషులు ఆరోగ్యంగా, దఢంగా ఉండునట), కులవృత్తులు, కులధర్మాలు నశించాయి, వారికి ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో ఆ వృత్తిని చేబట్టి గౌరవమర్యాదలను, స్థాయినా, సంపాదనను పొందుతున్నారు. సంఘాభివృద్ధికి తోడ్పడుతున్నారు, దేశాభివృద్ధికి పాటుబడుతున్నారు. విశాల ప్రపంచన్నంతా వాడుకొంటున్నారు.

సంకుచిత భావాలను వదులుకొంటున్నారు. కులగోడలను కూలదన్ని సువిశాలమైన మానవజాతిలో లీనమవ్ఞతున్నారు. అవిలేకపోతే పితరులు అధోగతి పాలవ్ఞతారనేది అర్జునుడి తలంపు. హ్రస్వదృష్టి, సంకుచిత దృష్టిగల అర్జునుని ఆశయాలకు పూర్తిభిన్నంగా శ్రీకృష్ణపరమాత్ముడు అంతా ఎలా జరిపించాడో మనం బాగా గ్రహిస్తే పితరులు అధోగతిపాలు కావటంగానీ, ఊర్ధ్వగతులు పొందటంగానీ వారివారి కర్మలపైనే ఆధారపడి ఉంటుందిగానీ మనం పెట్టే పిండాకూడుపైన ఆధారపడదని ఇట్టే తెలిసివస్తుంది. నిరంతరం అన్నదానాలు, దానధర్మాలు చేసిన వ్యక్తి తన కొడుకులు తద్దినాలు చేసి పిండం పెట్టనంతమాత్రాన అధోగతి పాలవ్ఞతాడా? అదే నిజమైతే శ్రీకృష్ణభగవానుడు యుద్ధాన్ని ఎందుకు జరిపిస్తాడు? అందరినీ ఎందుకు చంపిస్తాడు, పిండోదకాలు లేకుండా ఎందుకు చేస్తాడు? కులధర్మాలు నశించేట్టు ఎందుకు చేస్తాడు? వర్ణసాంకర్యమయేట్టు ఎందుకు చేస్తాడు? అంతా ఆదైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, మంచే జరుగుతుంది. దైవాధీనం జగత్సర్వం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/