జగన్ కీలక నిర్ణయం : రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా..? బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఏపీలో ఇదే విషయం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై పార్టీ నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ..సాయంత్రం లోపు ప్రకటన వస్తుందని అంటున్నారు. తెలంగాణ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గా చేసిన కృష్ణయ్య.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను పంపించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీకాలం పూర్తవుతుండగా.. అందులో తెలంగాణ నుంచి రెండు, ఏపీ నుండి నాల్గు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.