నేడు ఏపీలో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న జగన్

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి లో చాలామంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణించిన సంగతి తెలిసిందే. లక్షల ఖర్చు పెట్టి మరి ఆక్సిజన్ లను కొనుగోలు చేయడం జరిగింది. దీనిని గమనించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలాంటి ఇబ్బందులు మరోసారి పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పటు చేసారు. ఈ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఈరోజు సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరగనుంది.

ఒమైక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్‌ మహమ్మారిన బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక రాష్ట్ర సర్కార్ రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగానూ, రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పించారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

శ్రీకాకుళంలో 12 చోట్ల, విజయనగరంలో 2 చోట్ల, విశాఖపట్నలలో 12 చోట్ల, తూర్పుగోదావరిలో 13 చోట్ల, పశ్చిమగోదావరిలో 7 చోట్ల, కృష్ణాలో 12 చోట్ల, గుంటూరులో 7 చోట్ల, ప్రకాశంలో 5 చోట్ల, నెల్లూరులో 7 చోట్ల, చిత్తూరులో 21 చోట్ల, కడపలో 8 చోట్ల, అనంతపురంలో 9 చోట్ల, కర్నూలులో 9 చోట్ల.. మొత్తంగా 124 ప్రాంతాల్లో 133 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 11 ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 144 ప్లాంట్లు రాష్ట్రంలో ఉన్నాయి.

వీటిమొత్తం సామర్థ్యం దాదాపుగా 1.2 లక్షల ఎల్‌పీఎం పైమాటే. అంటే ఒక నిమిషంలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఈప్లాంట్ల నుంచి ఆక్సిజన్ తయారు అవుతుంది. దీంతో పాటు కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 18,268 ఆక్సిజన్‌ పైపులైన్లను రూ.40.07 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పైపులైన్లను మరింత బలోపేతం చేయడానికి 6,151 ఆక్సిజన్‌ లైన్లు వేయడంతోపాటు మరో రూ.50 కోట్లు ఖర్చుచేశారు.