అమ్మఒడి : తల్లుల ఖాతాల్లో రూ.6595 కోట్లు వేసిన జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ..జగనన్న అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.6595 కోట్లు జమ చేసారు. వైస్సార్సీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. విద్యార్థులను బడి బాటపట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద, చిన్నారుల తల్లుల ఖాతాలో ఏటా 15 వేలు జమ చేస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాదికి సంబంధించి, అమ్మ ఒడి నిధులను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పటు చేసిన సభలో జగన్ విడుదల చేసారు. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 6,595 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే.. ఈ పథకం అమలుపై ఇటీవల విమర్శలొచ్చాయి. వాటన్నింటిపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా.. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేసింది . ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేసారు. తాజాగా ఇచ్చిన ఈ సొమ్ముతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19,618 కోట్లు అందించినట్లు అయ్యింది. అమ్మ ఒడి మూడో విడత కార్యక్రమం నేపథ్యంలో.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది. సీఎం జగన్‌ తెచ్చిన ఈ పథకం వల్ల ఎందరో పేద తల్లిదండ్రులు.. తమ తమ పిల్లలను ఆనందంగా బడికి పంపుతున్నారు.