చంద్రబాబు.. హైదరాబాద్‌కు లోకల్‌..కుప్పానికి నాన్‌ లోకల్‌ – జగన్

jagan-speech-highlights-in-kuppam

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కుప్పంలో పర్యటించారు. సీఎం గా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి జగన్ కుప్పంలో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి అకౌంట్‌లలో జమ చేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు ఫై విమర్శల వర్షం కురిపించారు. కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌..కుప్పానికి నాన్‌ లోకల్‌ అని చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్‌ అయ్యారు.

కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని, కుప్పం అంటే అక్కాచెల్లెళ్ల అభివృద్ధి అని… కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి అన్నారు. ప్రతి మహిళకు ఏటా రూ.18,750 ఇస్తున్నామని… మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తుందన్నారు. కుప్పంలో బిసిలు పోటీ చేయాల్సిన సీటు అని… బిసిల సీటును లాక్కుని చంద్రబాబు పోటి చేస్తున్నాడని జగన్ ఆరోపించారు. 36 సంవత్సరాలలో కుప్పం సీటును ఒక్కసారి అయినా బిసిలకు ఇచ్చారా…అని నిలదీశారు. కుప్పం మీదా చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమా మాత్రమేనని ఎద్దేవా చేశారు. జాబ్ రావాలంటే బాబు రావాలంటాడు…కుప్పం నుండి రోజు ఐదు వేల మంది నిత్యం పక్క రాష్టాలకు వెళుతుంటారని చురకలు అంటించారు.

హంద్రీనీవాకు చంద్రబాబు అవరోధంగా మారారని.. చంద్రబాబు తనవాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారని విమర్శించారు. కుప్పం మున్సిపాలిటీలో డబుల్ రోడ్ కూడా వేయలేకపోయారన్నారు. రోడ్లు కూడా వేయలేని బాబు.. విమానాశ్రయం తీసుకొస్తానని ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని సెటైర్లు పేల్చారు. ఇంతకంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా.. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాప్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు.

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్ అని.. కుప్పంలో చంద్రబాబుకు ఇల్లే కాదు.. కనీసం ఆయనకు ఇక్కడ ఓటు కూడా లేదన్నారు. కుప్పం తన సొంతమని చంద్రబాబు ఏనాడు భావించలేదని.. హైదరాబాద్‌ ముద్దు అని భావించారన్నారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని.. చంద్రబాబుకు సొంత మామ మీద ఎలాంటి ప్రేమ ఉందో, కుప్పంపై కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమనే ఉందన్నారు. గతానికి ఇప్పటికి తేడాను గమనించాలన్నారు. కుప్పం రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు తనకు లేఖ రాశారని ఎద్దేవా చేశారు.