పవన్ ప్రశ్నించాడు..జగన్ సమీక్షించాడు

ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రోడ్ల దుస్థితిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ ఉద్యమం చేపట్టింది. దీని ద్వారా సోషల్ మీడియా లో లక్షలాది మంది ప్రజలు రోడ్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. ఈ పిక్స్ ను పవన్ షేర్ చేస్తూ ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమత్తులు చేయాలనీ సూచించారు.

ఈ క్రమంలో ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని.. తర్వాత పనుల కాలం మొదలవుతుందని తెలిపారు. ముందుగా రోడ్లను బాగుచేయడం పై దృష్టి పెట్టాలని మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయని.. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను బాగుచేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుందని వివరించారు.