ఆ మూడు జిల్లాల కలెక్టర్లతో జగన్ సమీక్ష

cm jagan

అల్పపీడన ప్రభావం తో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం వీరితో మాట్లాడిన జగన్..సాయంత్రం మరోసారి వీరితో సమీక్ష నిర్వహించారు.

వర్షాల ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అదేశించారు. తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.1,000 రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.