మేకపాటి విక్రమ్ విజయం ఫై సీఎం జగన్ ట్వీట్

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం ఫై వైస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అలాగే విక్రమ్ రెడ్డి సైతం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు.
నాపై నమ్మకంతో ఓటు వేసి.. 82,888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ప్రజలను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగిస్తాన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఆత్మకూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
ఇక ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది.