క్యాబినెట్ మీటింగ్ లో మంత్రి విడదల రజనీ ఫై ప్రశంసలు కురిపించిన జగన్

సీఎం జగన్ అధ్యక్షతన బుధువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. వైయస్‌ఆర్‌ లా నేస్తం, వైయస్‌ఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలుపడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ ప్రతిపాదనలకు మంత్రిమండ‌లి ఆమోద‌ముద్ర వేసింది.

ఇదిలా ఉంటె కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి విడదల రజనీ శాఖల పని తీరుపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖల పని తీరుపై బాగుందని కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో.. ధాన్యం కొనుగోళ్లులో తమ శాఖ కూడా బాగా పని చేస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే.. మిమ్మల్ని కూడా అభినందించాలా అని సీఎం జగన్ చమత్కరించారు. ముందు నుండి కూడా సీఎం జగన్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం అయ్యింది మొదలు.. ఇప్పటివరకు ఈ రెండు విభాగాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వీటి తోపాటు.. వ్యవసాయ రంగంపై జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ రంగాల్లో పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు దీంతో విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో ఏపీకి మంచి పేరు వస్తోంది.