సీఎం జగన్‌ ఫ్రాన్స్‌ పర్యటన ఖరారు…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవలె దావోస్‌కు పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నారు. జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఆమె చదువుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 2న బిజినెస్ స్కూల్లో కాన్వొకేషన్ కార్యక్రమం జరగనుంది. ఈ కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఇది పూర్తిగా జగన్ వ్యక్తిగత టూర్ గా సీఎంవో వర్గాలు వెల్లడించారు.

ఇదిలా ఉంటె రాష్ట్రంలోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు కూడా. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.