రోశయ్య మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (89) తుదిశ్వాస విడిచారనే వార్త యావత్ రాజకీయ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం బిపి డౌన్ కావడం తో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు స్టార్ హాస్పటల్ కు తరలించారు కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని..అమీర్ పేట్ లోని తన ఇంటికి తరలించారు.

రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని .. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరపనున్నారు. ఉదయం 11 : 30 గంటలకు ఆయన పార్థివదేహాన్ని గాంధీ భవన్ కు తరలించి అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. 12 :30 కు ఆలా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం కు అంతిమయాత్ర చేపట్టి…ఒంటిగంట ఆ సమయంలో ఆయన అంత్యక్రియలు జరపబోతున్నారు. 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య.. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం.