పేదలకు జగనన్న తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదవారికి తీపి కబురు తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో ఆ పట్టాలపై రుణం తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అలా తీసుకునే రుణాలపై లబ్ధిదారుడికి కేవలం పావలా వడ్డీ మాత్రమే పడుతుందని సీఎం స్పష్టం చేశారు. మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం భరోసానిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తులను స్వీకరించి వారికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 8వేల దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లకు సంబంధించి అక్టోబర్‌లోగా అన్ని సన్నాహకాలు పూర్తికావాలన్నారు. ఇప్పటివరకూ 10.11 లక్షలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని.. వీటి ప్రగతిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారని జగన్ తెలిపారు.