మోడీ , ఆర్థిక మంత్రితో జగన్‌ భేటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోడీ తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ జరిగింది. ఈ భేటీ లో పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రితో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన ఉందని జగన్ తెలిపినట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని, పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతున్నట్లు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ గడువు ముగియడం తో , తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. అలాగే తదితర విషయాలను మోడీ కి విన్నవించారు. మోడీ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.