రేపు ఢిల్లీ కి జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ కి వెళ్లబోతున్నారు. ఈ ఢిల్లీ పర్యటన లో ప్రధాని మోడీ తో భేటీ కాబోతున్నారని సమాచారం. అలాగే 30 వ తేదీన జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో జగన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం పై సెమినార్ ఉండనుంది. ఇక ఈరోజు జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాలలో పర్యటించబోతున్నారు.

జగన్ చేతుల మీదుగా 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం ఇందుకు వేదిక కానుంది. జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి, విశాఖపట్నం విమానాశ్రయం మీదుగా 10.30 గంటలకు పైడివాడ చేరుకుంటారు. హెలిప్యాడ్‌ వద్ద కొద్దిసేపు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. అనంతరం లే అవుట్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్కును ప్రారంభిస్తారు. లే అవుట్‌ స్వరూపాన్ని పరిశీలించిన అనంతరం మోడల్‌ గృహాల్ని లబ్ధిదారులకు అందజేస్తారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో మాట్లాడనున్నారు.