మే లో దావోస్ కు సీఎం జగన్..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటిసారి అధికారిక విదేశీ పర్యటన కు వెళ్లనున్నారు. జగన్ వారం రోజుల విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. మే 22వ తేదీ నుండి జగన్ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయిన తరువాత లండన్..అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన గానే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు ఏపీకి పెట్టుబడల ఆకర్షించేందుకు దావోస్ కు సీఎం వెళ్లనున్నారు.దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. ఈ సదస్సు మే 22-26 వరకు జరుగుతుంది. సదస్సు జరిగే వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు.
ఈ సందర్భంగా ఏపీకి పెట్టుబడులను తెచ్చేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. ఈ సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు వివిధ కేటగిరీల కింద అవార్డులు కూడా అందజేస్తారు. మన దేశం నుంచి ఈసారి పలువురు యువ పారిశ్రామికవేత్తలు ఈ అవార్డుల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ ఏటా దావోస్ లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ కు హాజరయ్యేవారు. అదే విధంగా తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సైతం తరచూ అక్కడ జరిగే సమిట్ లకు హాజరవుతున్నారు.
ఇక ఇప్పుడు జగన్ వెళ్లనున్నారు. జగన్ దావోస్ పర్యటనలో ఏపీ పరిశ్రమల మంత్రి అమర్ నాధ్ తో సహా అధికారుల టీం వెళ్లనుంది. ఈ మీట్ లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించటంతో పాటుగా కొన్ని సంస్థలలో ఎంఓయూలు చేసుకొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఏపీలో పెట్టుబడులకు జరిగే ఒప్పందాలు..సీఎం జగన్ కు కీలకంగా మారనున్నాయి.