ఆరోగ్యశ్రీలోకి కొత్త చికిత్సలు చేరుస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్

ఆరోగ్యశ్రీలోకి ఇప్పటికే పలు చికిత్సలుతీసుకొచ్చిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…తాజాగా మరో తీపి కబురు తెలిపారు. ఆరోగ్యశ్రీలోకి మరికొన్ని కొత్త చికిత్సలు చేరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254 చేరనుంది. అంతేకాకుండా.. ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈరోజు శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108..104 వాహనాల సేవల కోసం సుమారు మరో రూ.400 కోట్లు చేస్తున్నాం. మొత్తంగా దాదాపు రూ.3,200 కోట్లు వరకూ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254 చేరనుంది. అంతేకాకుండా.. ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే 432 కొత్త 104 వాహనాలు డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న 676 వాహనాలకు కొత్తవి తోడై మొత్తంగా ఆ సంఖ్య 1,108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748 108-వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.