వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న జగన్

గత రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీ ఫై భారీగా పడింది. ముఖ్యంగా కడప , నెల్లూరు , చిత్తూరు , ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. గురువారం , శుక్రవారం భారీ వరదలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాలు నీటమునిగాయి. పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఇల్లులు నీటిమట్టం అయ్యాయి. పశువులు సైతం వరదల్లో కొట్టుకపోయాయి. కడప జిల్లాలో పలు ఆనకట్టలు , చెరువులు తెగిపోయి గ్రామాలను ముచ్చేత్తాయి. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెయ్యేరు వంతెన వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతితో ఈ నది పరివాహక పరిధిలోని రాజంపేట, పులపత్తూరు‌, మందపల్లి శివాలయం ఘటన, బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనల్లో30 మంది గల్లంతు కాగా.. శుక్రవారం రాత్రి వరకు 12మృతదేహాలు లభ్యమయ్యాయి.

పులపత్తూరు, మందపల్లి ఘటనలో 4మృతదేహాలు, బస్సు ఘటనలో 4మృతదేహాలు, గుండ్లూరు శివాలయం, మసీదులలో రెండు మృతదేహాలు, అన్నయ్యవారి పల్లెలో రెండు మృతదేహాలు లభ్యమయినట్లు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకున్న సీఎం జగన్‌.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్, అధికారులతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు.