న్యూజిలాండ్‌ ప్రధానిగా రెండోసారి జెసిండా ఘన విజయం

Jacinda Ardern wins New Zealand election

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పోలింగ్‌లో 1.9 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం కొనసాగిన కౌంటింగ్‌లో 50 శాతం బంపర్‌ మెజార్టీ సాధించి జెసిండా చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిర్వహించడంలో ఆమె చూపిన చొరవకు ఈ ఘన విజయం తార్కాణంగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మొదలుపెట్టిన 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని సెంటర్లెఫ్ట్ లేబర్ పార్టీ 50 శాతం ఓట్లతో 65 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ పార్టీ కేవలం 27 శాతం ఓట్లతో 35 స్థానాల్లో విజయం సాధించారు. 2002 నుండి నేషనల్‌ పార్టీకి ఇదే చెత్త ఫలితం. న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇద్దరు మహిళల మధ్యే జరిగింది. 61 ఏళ్ల జుడిత్ కాలిన్స్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ (40) ను సవాలు చేశారు. లేబర్ పార్టీకి చెందిన జెసిందా 2017 లో ప్రధాని అయ్యారు. జెసిండా నేతృత్వంలోని న్యూజిలాండ్.. కొవిడ్19 ను నియంత్రించడంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. గురువారం నాటికి ఇక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.

కాగా షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌లో సెప్టెంబర్ 19న ఎన్నికలు జరగాలి. అయితే కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో అక్టోబర్ 17కు ఎన్నికలు వాయిదా పడ్డాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/