విడాకులు కాదు చికిత్స ముఖ్యం!
‘వ్యధ’ మానసిక సమస్యలకు పరిష్కారవేదిక (ప్రతి గురువారం)

ముఖ్యాంశాలు
- కొడుకు.. భార్య అత్తమామలతో వేగలేక డిప్రెషన్
- భయం, ఆందోళన, ఒత్తిడి ఆతని జీవితంలో భాగం
- ఏంచేయాలో చేయలేక సతమతం
- లాక్‌డౌన్ పుణ్యమా మా అబ్బాయి మావద్దే ఉంటున్నాడు
అన్నీ తెలిసిన వారికి చెప్పి నొప్పించడం సులభం. ఏమీ తెలియని వారికి వివరించి వివేకం కల్పించవచ్చు. తెలిసీ తెలియని అర్ధజ్ఞానులను మార్చడం కష్టం అన్నది నానుడి.
అయితే బాగా చదువుకుని బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసేవారిలోను మూర్ఖులు, మొండివారు ఉంటారని అనుభవపూర్వకంగా తెలిసింది.
చదువుకున్న ప్రతి వారు జ్ఞానులు కారని అర్ధమయింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మా వియ్యపు వారు, డాక్టరుగా ఉన్న మా కోడలి ప్రవర్తన చూసిన తరువాత ఈ అభిప్రాయం కలిగింది.
నేను కూడ ఉపాధ్యాయురాలినే. వేల మంది విద్యార్థులకు చదువు చెప్పి, సంస్కారాలు నేర్పాను.
అయితే నా కొడుకు ఇప్పుడు భార్య, అత్తమామలతో వేగలేక డిప్రెషన్‌కు గురవుతున్నాడు. భయం, ఆందోళన, ఒత్తిడి అతని జీవితంలో భాగమయ్యాయి.
భార్యకు చికిత్స చేయించలేక, అత్తమామలను నొప్పించలేక సతమతమవుతున్నాడు.
లాక్‌డౌన్ పుణ్యమా అని భార్యకు దూరంగా మా వద్ద ఉన్నాడు. లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ నరకప్రాయమైన సొంత ఇంటికి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నాడు.
భార్యను, అత్తమామలను మార్చుకోలేక సతమతమవుతున్నాడు. మాది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం. నేను, మావారు ఇద్దరం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము.
మాకు ఉన్న ఏకైక అబ్బాయిని బాగా చదివించి డాక్టరును చేశాము. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కే చెందిన ఒక డాక్టర్‌తో అతని పెళ్లి చేశాము. ఆమె తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు.
అమ్మాయి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.
కాబట్టి అన్ని విధాలా సరిపోయే సంబంధం అనుకుని కట్నం, కానుకలు అడగకుండా మేమే ఖర్చు పెట్టి పెళ్లి చేశాము. యేడాది తిరగకుండానే వారికి ఒక బాబు పుట్టాడు. అంతా ఆనందంగా ఉన్నామనుకుంటుండగా నా కోడలి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి.
అతన్ని అనుమానించడం, లేనిపోని నిందలు వేయడం ప్రారంభించింది. రోజు ఏదో విధమైన వాదన పెట్టుకోవడం ఆమెకు పరిపాటిగా మారింది. ఒక్కోసారి వాదనలు పెరిగి కొట్టే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
మా అబ్బాయి మాతో మాట్లాడినా, మా సలహాలు పాటించినా గొడవ పెట్టుకుని సాగదీసి రాద్ధాంతం చేస్తుంది. పెళ్లయిన కొత్తలోనే ఆమెలోని మొండితనం యటపడింది.
అయితే కాలంతో పాటు ఆమెలో మార్పు వస్తుందని భావించి మా అబ్బాయే సర్దుకున్నాడు.
ఓ బాబు పుట్టిన తరువాత అయినా దానికి, కాని దానికి కయ్యానికి కాలు దువ్ఞ్వతున్న ఆమె ప్రవర్తన చూసి ఏదో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నదని గ్రహించాడు.
సైకియాట్రిస్టును కలసి అతని అభిప్రాయం తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు. ఆ విషయం ఆమెకు చెపితే తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది.
నేనేమీ పిచ్చిదానిని కాదని, తాను కూడా డాక్టరునే అన్న విషయం మరచి పోవద్దని హెచ్చరించింది. ఆమె ప్రవర్తన సరిలేదని, ఆమెను సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లడానికి సహకరించమని అత్త, మామలను ప్రాధేయపడ్డాడు.
అయితే వారు కూడా ఆమెకే మద్దతుగా మాట్లాడుతున్నారు. తమ అమ్మాయిది తప్పేమీ కాదని వెనకేసుకొస్తున్నారు. పైగా మా అబ్బాయిదే తప్పని నిందించి అవహేళన చేస్తున్నారు. మార్చి నెలలో ఇద్దరి మధ్య పెద్ద గొడవయ్యింది.
అమ్మాయి రెచ్చిపోయి టివి రిమోట్‌తో భర్త నెత్తి మీద కొట్టింది. తాను వంటగదిలోకి వెళ్లి చాకు తీసుకుని చేతిపై కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
పక్కింటి వారు వచ్చి ఇద్దరికి సర్దిచెప్పి ప్రాథమిక చికిత్సలు చేయించారు.
మరుసటి రోజు మా అబ్బాయి ఆమెకు చెప్పకుండా ఆసుపత్రిలో సెలవ్ఞ పెట్టి మా ఊరికి వచ్చాడు. ఇంతలో కరోనా వల్ల లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇక్కడు ఉన్నాడు.
మళ్లీ హైదరాబాద్ వెళ్లి ఆమెతో కలసి ఉండాలంటే భయపడుతున్నాడు. విడాకులు తీసుకుందామని భావిస్తున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
- వసుంధర
అమ్మా! మీ అబ్బాయి, కోడలి సమస్య అర్ధమయింది. మీరు అన్నట్లు కొన్ని సందర్భాలలో చదువుకున్న వారు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు.
దీనికి వ్యక్తిత్వం, దృక్పథం ప్రవర్తనాలోపాలు కారణం. అలాగే కొందరిలో ఉన్న మానసిక రుగ్మతలు వారిలోని వివేకాన్ని నశింపచేసి మొండిగా తయారవడానికి కారణమవుతాయి.
ఉపాధ్యాయులు అయినంత మాత్రాన లోపాలు ఉండకూడదని, డాక్టర్లకు రోగాలు, రుగ్మతలు రాకూడదని లేదు. చదువు, జ్ఞ్ఞానంతో పాటు అన్నీ సమకూరాలని లేదు.
కాబట్టి సమస్యను సమస్యగా చూడండి. మీ కోడలు డాక్టరు అయినప్పటికీ, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నదని అర్ధమవుతున్నది.
పెళ్లయిన తొలి రోజుల్లోనే ఆమెలోని లోపాలను మీ అబ్బాయి గమనించాడంటున్నారు.
అయితే అవి ప్రవర్తనాలోపాలని సరిపెట్టుకుని ఉంటారు. ఆమెలో యవ్వన దశనుంచే ఉద్వేగలోపాలు ఉండి ఉండవచ్చు.
గర్భం దాల్చి, బిడ్డను కనే సమయానికి ఆమెలోని రుగ్మతలు తీవ్రరూపం దాల్చి ఉండవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఆమెలో విపరీత భావాలు, సైకోసిస్ సంబంధిత సమస్యలు ఉన్నాయని భావించాల్సి ఉంటుంది.
ఆమె భర్తను అనుమానించడం, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం,రిమోట్‌తో భర్తను కొట్టడం, ఆమె కత్తితో చేతిపై కోసుకోవడం లాంటివి సైకోసిస్ లక్షణాలు.
ఒకవేళ ప్రసవానంతరం వచ్చే పోస్ట్‌నేటర్ సైకోసిస్ కావచ్చు.
ఒక్కోసారి ఇలాంటి వారిలో స్కిజోఫ్రినియా ఉన్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి విడాకులు ఆలోచనకంటే ఆమెకు చికిత్స ఎలా చేయించాలో ఆలోచించండి.
మీ అబ్బాయి డాక్టరే కాబట్టి ఎవరైనా సైకియాట్రిస్టును కలసి చర్చిస్తే ఆమెను వైద్యానికి ఎలా ఒప్పించాలో చెపుతారు.
అలాగే ఇద్దరికి సంబంధించిన మిత్రుల సహకారంతో ఆమెను చికిత్సకు ఒప్పించండి. ఆమె తల్లిదండ్రులకు కూడా సున్నితంగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి.
అవసరమయితే బలవంతంగానైనా సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయించండి. ఏదీ ఫలించనపుడు ఆఖరు అస్త్రంగా విడాకుల గురించి ఆలోచించండి.
-డాక్టర్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/