అది ప్రేమ కాదు, ప్రవర్తనాలోపం!

women
women

మా అమ్మాయిది ప్రేమో వ్యామోహమో అర్ధం కావడం లేదు. తన పిచ్చి చేష్టల ద్వారా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. తాను సీతలాంటి దంటూనే శూర్పణఖలా మగాళ్ల వెంట పడుతోంది. ఏడవతరగతి నుంచే ప్రేమాయణం ప్రారంభించింది. ఇప్పుడు ఒక వయసు మళ్లిన కారు డ్రైవర్‌తో వెళ్లిపోవడానికి సిద్ధపడింది. ఆమె వ్యవహారశైలిని పరిశీలించి సరిదిద్దే మార్గం చూపండి. మాది మధ్యతరగతి కుటుంబం. మా వారు ఒక కంపెనీలో సేల్స్‌ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తున్నారు. ఒక్కోసారి వారం, రెండు వారాలు ఇంటికి రారు. నేను ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బిటెక్‌ పూర్తి చేసింది. రెండవ అమ్మాయి బిటెక్‌ మూడవ సంవత్సరం చదుతున్నది. ఇప్పుడు సమస్య పెద్దమ్మాయిది. ఆమె వయస్సు 22 యేళ్లు. చిన్నప్పటి నుంచి ఆమె అందరితో కలిసిపోయి తిరగడం అలవాటు చేసుకున్నది. అమ్మాయిలకంటే అబ్బాయిలతోనే ఎక్కువగా ఆడుకునేది. ఆమె తీరు చూసి చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి అనుకునే వారం. ఏడవ తరగతి చదివే రోజుల్లో ఇంటిలో చిన్న చిన్న మొత్తాలు దొంగిలించి ఒక అబ్బాయికి ఇచ్చేది. ఇద్దరు కలసి ఎక్కువగా ఆడుకోవడం చేసేవారు. అబ్బాయిలతో తిరగవద్దంటే తనకు అన్న, తమ్ముడు అన్నవారు లేనందున ఆ అబ్బాయిలో వారిని చూసుకుంటున్నానన్నది. దీంతో ఆమె సదుద్దేశాన్ని అనుమానించడం మంచిది కాదని వదిలేశాము. అయితే ఇంట్లో డబ్బు మాయం కావడంతో అనుమానమొచ్చి సిఐడిలా అన్వేషించగా మా అమ్మాయే తీస్తున్నదని తెలిసింది. ఆ డబ్బుతో అబ్బాయికి కావల్సినవి కొనిపెట్టడం చేసేదని తేలింది. దీంతో మందలించి ఆ అబ్బాయితో కలిస్తే స్కూలు మాన్పించేస్తామని భయపెట్టాం. అప్పటి నుంచి ఆ అబ్బాయితో స్నేహం చాలించింది. అయితే అయితే పదవతరగతిలో మరొక అబ్బాయితో స్నేహం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టి ఇద్దరు కలసి షికార్లు తిరగే స్థితికి వచ్చారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నదని తోటి విద్యార్థులు గుసగుసలాడుకోవడంతో క్లాసు టీచరుకు విషయం తెలిసింది. ఆమె నన్ను పిలిపించి విషయం చెప్పి, మా పాపను అబ్బాయిని గట్టిగా మందలించి భయపెట్టింది. మా పాప, ఆ అబ్బాయి ఇద్దరి వద్ద దేవుని మీద ఒట్టు వేయించి పంపేసింది. అప్పటికి ఆ సమస్య తీరింది. ఇంటర్‌లో ఒకబ్బాయితో తిరిగింది. అతను కొంత శాడిస్టులా వ్యవహరించడంతో వదిలేసింది. ఆ విషయం కొంత ఆలస్యంగా తెలిసింది. బిటెక్‌ పూర్తయ్యే వరకు అలాంటి సమస్యలు ఏవీ ఉత్పన్నం కాలేదు. ఇటీవల కుటుంబ సభ్యులందరం కలసి ఒక ప్రైవేట్‌ టాక్సీలు తిరుమలకు వెళ్లి వచ్చాము. ఆ సమయంలో అతనితో పరిచయం పెంచుకున్నది. అతనితో రోజు ఫోన్‌ చేసి మాట్లాడటం చేసేది. అతని వయస్సు 45 యేళ్లు ఉండవచ్చు. కాబట్టి మేము అనుమానించలేదు. వారం క్రితం అమ్మాయి మాకు చెప్పకనే ఇంటికి తాళం వేసి, తాళం చెవి పక్క ఇంటిలో ఇచ్చి వెళ్లిపోయింది. పక్కింటి ఆమెతో బస్టాండుకు వెళ్లి వస్తానని చెప్పిందట. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి వెదకడం ప్రారంభించాము. ఆమె డ్రైవర్‌ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని బలవంత పెట్టిందట. అతను అయిదేళ్ల క్రితం భార్యను వదిలిపెట్టి ఖాళీగా ఉన్నాడు. కాబట్టి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించి, ఎక్కడైనా గుడిలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదృష్టం బాగుండి అతని స్నేహితుని ద్వారా విషయం తెలుసుకుని ఇద్దరిని పట్టుకుని నిలదీశాము. ఈ నేపథ్యంలో మా అమ్మాయి, మనసు మార్చి, మంచి దారిలో పెట్టడానికి తగిన మార్గం చెప్పండి. – అనసూయ
అమ్మా! మీ అమ్మాయిది ప్రేవ కాదు, ప్రవర్తనాలోపం. హార్మోన్లు, పరిసరాల ప్రభావం వల్ల ఆమెలో వ్యామోహతత్వం పెంపొందినట్లు తెలుస్తున్నది. అలాగే అమ్మాయితో శృంగారపరమైన విపరీత ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లోపాలను రుగ్మత లక్షణాలుగా భావించాలి. కొంత మందిలో విపరీత కోర్కెలు తలెత్తి దారి తప్పేలా చేస్తాయి. ఇలాంటి చాల అరుదుగా కనిపిస్తుంటారు. లక్షణాలను బట్టి ఇలా ప్రవర్తించే వారిని కాండక్ట్‌ డిజార్డర్‌ లేదా నింఫోమ్యానియాతో బాధపడుతున్నట్లు భావించాలి. అయితే పూర్తి లక్షణాలను పరిశీలిస్తే తప్ప రుగ్మత పేరు పెట్టలేము. రుగ్మత విషయం ప్రక్కన పెడితే మా అబ్బాయిలో ప్రవర్తనా లోపాలు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తున్నది. ముందు ఒక సైకాలజిస్టు ద్వారా కౌన్సిలింగ్‌ ఇప్పించండి. వివేక కల్ప, అవగాహన, ఉపశమన మార్గాల ద్వారా ఆమె ప్రవర్తలో మార్పు తీసుకురావడానికి సైకాలజిస్టు కృషి చేస్తారు. అలాగే ధ్యానం, సెల్ఫ హిప్నాటిజం, లక్ష్య నిర్దేశం, నైతిక విలువలు పెంపొందించడం ద్వారా కూడ మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే హార్మోన్ల సమస్యలు, నింఫో మ్యానియా లక్షణాలు ఉంటే మాత్రం కౌన్సిలింగ్‌ పూర్తిస్థాయిలో సఫలం కాకపోవచ్చు. మీరు ఆమె వ్యవహారశైలి, ప్రవర్తనలను సునిశితంగా పరిశీలించి మార్పుస్థాయిని విశ్లేషించండి. కౌన్సిలింగ్‌ ప్రభావంతో ఆమెలో మార్పు రాదని అనిపిస్తే సైకియాట్రిస్టు లేదా సెక్స్‌ స్పెషలిస్టును కలిసి చికిత్స చేయించండి. అక్కడ వారు మితిమీరిన ఉద్వేగాలు, విపరీత ధోరణులు నియంత్రణలో ఉండటానికి తగిన మందులు ఇస్తారు. వారి సలహాను అనుసరించి మందులతో పాటు కౌన్సిలింగ్‌ కొనసాగించడం మంచిది. అలాగే ఆమెను ఒక కంట కనిపెట్టుకుని ఉండటం మాత్రం చాలా అవసరం. కొంత దారిలోకి వచ్చిన తరువాత తగిన సంబంధం చూసి పెళ్లి చేయడం కూడా మంచి పరిష్కారమే. అయితే చికిత్స చేయించకుండా మాత్రం పెళ్లి చేయడం మంచిది కాదు. అక్కడ ఇలాంటి విచలన వ్యవహారం సాగిస్తే దాంపత్య కలహాలు ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఓర్పుగా అమ్మాయికి కౌన్సిలింగ్‌, చికిత్సలు చేయించండి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,
    సైకాలజిస్టు

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/